Jan 21, 2011

రాజా

గాత్రం: ఉన్నికృష్ణన్,చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి

లాల్లలాల్లలా లాల్లలాల్లలా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

చరణం1:

గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార వాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని తరిమే బంధమిది
కల చెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

చరణం2:

పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు తుళ్లి తుళ్లి ఆడుతున్నవి
పంచలేని ఊహలే పంచవన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళ
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈవేళ
అణువణువును తడిపిన ఈ తడి అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటలు పరిచిన వనమున చూస్తున్నా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది

||

No comments: